ఇంటింటా ఇన్నోవేటర్ ద్వారా ఆవిష్కరణలకు గుర్తింపు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు

Published: Thursday July 28, 2022
మంచిర్యాల బ్యూరో, జులై 27, ప్రజాపాలన -
 
ప్రజా ఉపయోగకర ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ఆవిష్కర్తలు రూపొందించిన ఆవిష్కరణలకు గుర్తింపు లభిస్తుందని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లాలోని సింగరేణి, వివేకానంద పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపకులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలోని ఆవిష్కర్తలను గుర్తించడానికి, వారు రూపొందించిన ఆవిష్కరణలకు గుర్తింపు ఇవ్వడానికి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిచడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించేందుకు ఆవిష్కర్తలు వినూత్న ఆలోచనలతో కృషి చేయాలని తెలిపారు. ఆగస్టు 5వ తేదీ లోగా రూపొందించిన ఆవిష్కరణలను 9100678543 నంబర్కు వాట్సాప్ చేసి నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన ఆవిష్కరణలను ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించడంతో పాటు సంబంధిత ఆవిష్కర్తలకు సర్టిఫికెట్ ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు, అధ్యాపకులు ఆనంద్, సాంబమూర్తి, రవికుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.