తెలంగాణలో గొర్రెల పెంప‌కం శిక్ష‌ణ సంస్థ‌ ఏర్పాటు చేయండి

Published: Wednesday March 24, 2021
ప్రపంచంలో గొర్రెల పెంపకంలో భారత్ రెండో స్థానంలో ఉంది
చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజీత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 23 ( ప్రజాపాలన ) : గొర్రెల పెంపకంతో అనేక ఆర్థిక లాభాలు ఉన్నాయని చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ స‌భ‌లో 377 నిబంధ‌న కింద సభాపతి డాక్టర్ (ప్రొఫెసర్) కిరీటి ప్రేంజిభాయి సోలంకి ద్వారా సంబంధిత మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో గొర్రెల పెంపకంలో భారత్ రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. గొర్రెల పెంపకంతో అనేక ఆర్థిక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. మాంసం, ఊలు, ఎరువు, పాలు ఇలా అనేక ఆర్థిక లాభాలు ఉన్నాయని వివరించారు. గొర్రెల మాంసం, ఎరువుకు చాలా డిమాండ్ ఉందని వివరించారు. గొర్రెల పెంపకం అనేది సుమారు 5లక్షల మంది పేదలకు జీవనోపాధిగా లభిస్తుందన్నారు. గొర్రెల పెంపకంలో శాస్త్రీయ పద్దతులపై అవగాహన లేకపోవడంతో ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేత భూమి, వలసలను తగ్గించడం వల్ల గొర్రెలకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. గొర్రెల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గొర్రెల పెంప‌కం శిక్ష‌ణ సంస్థ‌ ఏర్పాటు చేయాలని లోక్ సభ వేదికగా కేంద్రాన్ని కోరారు. ఈ సంస్థ ద్వారా గొర్రెల పశుగ్రాసం, టీకా, మందులు, యాంటెల్మింటిక్స్(నట్టల నివారణ మందులు), పెంపకదారులకు శిక్షణ, ప్రదర్శన, శిక్షణ కేంద్రాలుగా పనిచేయడానికి గొర్రెల హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.