పరమేశ్వరుని గుట్టపై ఆదిదంపతుల కల్యాణోత్సవం

Published: Monday February 20, 2023

వికారాబాద్ బ్యూరో 19 ఫిబ్రవరి ప్రజాపాలన : ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరణార్క ప్రభో శాంతం రామదూతం నమామిహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని గుట్టపై ఆదిదంపరతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథాన్ని వివిధ రంగురంగుల పూలతో అతి సుందరంగా అలంకరించారు. అలంకరించిన రథంపై పార్వతీ పరమేశ్వరుల అలంకరించిన చిత్రపటాలను ఉంచారు. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామం నుండి పరమేశ్వరుని గుట్ట వరకు భక్తులు రథాన్ని లాగారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర భక్తి నినాదాలు చేస్తూ రథోత్సవం ఊరేగింపు కొనసాగింది. వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పులుసు మామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఎక్కువ ఆనంద్ హాజరయ్యారు. ఆదిదేవుడైన పరమేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని చూసి తరించడానికి పులుసు మామిడి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. వేదమంత్రాల సాక్షిగా ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని వేదాచార్యులు నిర్వహించారు. వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పులుసుమామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి పుణ్యదంపతులు, పటేల్ మల్లేశం పుణ్యదంపతులు ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.  భక్తులెల్లరు సుఖశాంతులతో పాడిపంటలతో సస్యశ్యామలంగా జీవించేందుకు కోరికలు కోరుకున్నారు. పరమేశ్వరుని గుట్టపై పార్వతీ పరమేశ్వరుల ఆలయం నవగ్రహాలు ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలు కామిడి చంద్రకళ కమాల్ రెడ్డి, శివారెడ్డి పేట్ సహకార సంఘం డైరెక్టర్ జనార్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.