పీరంపల్లి గ్రామాభివృద్ధే లక్ష్యంగా కృషి

Published: Monday February 15, 2021

నల్ల బండ రాతి నేలలో జీవం పోసుకున్న 600 మొక్కలు
10 లక్షల జిపి నిధులతో సిసి రోడ్ల నిర్మాణం
గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల్ల జయమ్మ నరేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13 ( ప్రజాపాలన ) : గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే బలమైన సంకల్పబలం ఉంది. సంకల్పబలానికి తోడుగా నిధులు కూడా వస్తున్నాయి. గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి బాటలు వేసుకున్నారు. అనుకున్న కార్యాన్ని దైవమే చేపట్టినట్లుగా పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధికి నిధులు నెలనెలా వస్తున్నాయి. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతో ప్రభుత్వం అప్పగించిన పనులలో పురోగతి సాధిస్తున్నది. గ్రామాభివృద్ధికి చేపట్టిన పనులు: ప్రభుత్వం సూచించిన కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డు, పెంట కుప్పల తొలగింపు, గ్రామాంతర్గత ప్రధాన రోడ్డుకు ఎర్ర మట్టి పోయడం, రోడ్లపై వర్షపు నీరు నిలువకుండా కాంక్రీట్, మొరం పోయడం, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, పాడుబడిన గోడలను తొలగించడం, పారిశుద్ధ్యం పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. మురికి కాలువల శుభ్రత :
గ్రామాంతర్గత మురికి కాలువ పూర్తిగా పూడుకున్న దానిని జేసిబితో శుభ్రం చేయించారు. మురికి నీరు, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండేది. బందెన్నోల్ల రంగారెడ్డి ఇంటి నుండి సోలార్ ప్లాంటింగ్ వరకు ఉన్న మురికి కాలును జేసిబితో శుభ్రం చేయించడం వలన మురికి నీరు సాఫీగా ప్రవహిస్తుంది. 10 లక్షల జిపి విధులతో సిసి రోడ్ల నిర్మాణం :
బందెన్నోల్ల ముకుంద్ రెడ్డి ఇంటి నుండి మన్మరి మల్లయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. 150 మీటర్ల పొడవు గల రోడ్డును 5 లక్షల జిపి విధులతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎస్సీ కాలనీలోని బాగన్నోల్ల అంజయ్య ఇంటి నుండి గోపమోల్ల బందయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యింది. 150 మీటర్ల పొడవు గల రోడ్డును 5 లక్షల జిపి నిధులతో పూర్తి చేశారు. ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం: ఒక లక్ష జిపి నిధులతో కుర్వ రాంచంద్రయ్య ఇంటి నుండి నారె గూడెం భీంరెడ్డి బావి వరకు ఫార్మేషన్ ( పానాది రోడ్డు ) రోడ్డును వేశారు. ఎర్రమట్టితో సుమారు 500 మీటర్ల ఫార్మేషన్ రోడ్డును నిర్మించారు. నిర్మాణం చేపట్టాల్సిన ఫార్మేషన్ రోడ్డు : ఎన్కేపల్లి రోడ్డు నుండి కొటాలగూడ రోడ్డు వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. పాత వాటర్ పైపు లైన్ మరమ్మతులు : ఎన్కేపల్లి శివారు బోరు నుండి రెండు వందల మీటర్ల వరకు పాత వాటర్ పైపులైన్ ను మరమ్మతులు చేయించారు.  50 వేల జిపి నిధులతో మరమ్మతుల పనులు కొనసాగించారు. గ్రామాభివృద్ధికి మైనింగ్ తోడ్పాటు: ఎర్రమట్టి, సోలార్ ప్లాంట్ వలన గ్రామాభివృద్ధికి నిధులు సమకూరుతున్నాయి. వైకుంఠధామం వాటిక నిర్మాణం: వైకుంఠధామం నిర్మాణపు పనులు పురోగతిలో ఉన్నాయి. నల్లరాయి నేల కావడంతో పునాదులు తవ్వడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని గ్రామ ఉప సర్పంచ్ శివారెడ్డి తెలిపారు. పునాదులు తవ్వేటప్పుడు జేసిబి పళ్ళు విరగడంతో నిర్మాణపు పనులలో ఆలస్యమైనదని ఉప సర్పంచ్ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పీరంపల్లి గ్రామం సందర్శనకు వచ్చినప్పుడు ఫిబ్రవరి మాసాంతం వరకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని వివరించారు. ప్రస్తుతం పునాదుల నిర్మాణం పూర్తయ్యింది. గోడల నిర్మాణం కొనసాగుతున్నది. హరిత హారం : పచ్చందాల గ్రామంగా తీర్చాలనే బలమైన సంకల్పం ఉన్నప్పటికీ నల్లబండ రాయి నేల సహకరించడం లేదని గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల్ల జయమ్మ నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే మొక్కలు నాటాలనే దృఢ సంకల్పంతో అష్టకష్టాలు పడి నల్లరాయిని జెసిబి సహాయంతో గుంతలు తవ్వించినా సరియగు గుంతలు రాలేదని ఆవేదన చెందారు సర్పంచ్. అయినప్పటికీ ఎక్కడెక్కడ మెత్తని నేల ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలలో సుమారు 600 మొక్కల వరకు నాటి బతికించడం విశేషం. పతంగి, కానుగ, టేకు, కుంకుడు, దానిమ్మ, జామ వంటి మొక్కలు నాటించడం జరిగిందని సర్పంచ్ జయమ్మ అన్నారు. రాబోవు వర్షా కాలం నాటికి నర్సరీలో గ్రామావసరాన్ని బట్టి మొక్కలను పెంచనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పదకొండు బెడ్లు ఉండగా అందులో ఏడింటిలో దానిమ్మ, జామ, కుంకుడు విత్తనాలు వేశామని వనమాలి సంగీతంగారి అనిత తెలిపారు. పల్లె వనానికి త్వరలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని సర్పంచ్ జయమ్మ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.