సృజనాత్మకతకు ఆచరణ రూపాన్ని అందించే వేదిక 'ఇంటింటా ఇన్నోవేటర్'

Published: Wednesday July 20, 2022
మంచిర్యాల బ్యూరో, జులై19, ప్రజాపాలన :
 
ప్రజలకు ఉపయోగపడే శాస్త్ర, సాంకేతిక ఆలోచనలకు పదును పెట్టి, సైన్స్పై ఆసక్తి పెంచి, సృజనాత్మకతకు ఆచరణ రూపాన్ని అందించేందుకు “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమాన్ని వేదికగా వినియోగించుకోవచ్చని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 2022 సంవత్సరానికి గాను ఆవిష్కరణలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి, వ్యాపారంలో తలెత్తే సమస్యలు  -  సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా లభించే పరికరాలతో వస్తువులను రూపొందిం  చడానికి ప్రయత్నించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల నుంచి మొదలు రైతులు, గృహిణులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం జరుగుతుందని, ఆవిష్కర్తలు చేసిన పరికరాలకు వారే పేటెంట్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా నుండి జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్  కుమార్, సైన్స్ అధికారి మధుబాబు టెలీకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థలు ఈ ఆవిష్కరణలు పంపించే విధంగా ప్రయత్నించాలని, గతంలో మన జిల్లా నుండి బెల్లంపల్లికి చెందిన యువకుడు సాల్మన్ తాను స్వయంగా తయారు చేసిన ద్వారా ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డ్ పొందడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో 15 మందికి ఉపాధి కూడా కల్పిస్తూ అన్ని వస్తువులను సులభంగా ఇంటింటికి చేరవేసే హెూమ్ డెలివరీ వ్యాపారం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా ఎంపిక కాబడిన వెల్గనూరు విద్యార్థుల ఆవిష్కరణ 1.5 లక్ష రూపాయలు పొందడం జరిగిందని, జన్నారం మండలానికి చెందిన రైతు ఏనుగు శ్రీకాంత్రెడ్డి తయారు చేసిన కలుపు యంత్రం గతంలో ఇంటింటా ఇన్నోవేటర్లో ఎంపికై ప్రస్తుతం ఎందరో పేద రైతులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇలా వినూత్న ఆలోచనలతో రూపొందించిన ఆవిష్కరణను ప్రదర్శించదలిచిన వారికి ఇది మంచి అవకాశమని, ఆవిష్కరణలు రూపొందించే ముందు ఇందుకు సంబంధించిన నాలుగు ఫోటోలు, ఆరు వాక్యాలు, రెండు నిమిషాలు నిడివి కలిగిన వీడియో, ఆవిష్కర్త పేరు, సెల్ ఫోన్ నంబరు, ప్రస్తుత వృత్తి, చిరునామా పూర్తి వివరాలను 9100678543 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించవలసి ఉ ంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వచ్చిన ఆవిష్కరణలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శించడంతో పాటు ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.