వరద ముంపుకు గురైన బాధితులను పరామర్శించిన - ప్రేమ్ సాగర్ రావు

Published: Saturday July 16, 2022

మంచిర్యాల టౌన్, జూలై 15, ప్రజాపాలన : మంచిర్యాలలో వరద  ముంపుకు గురైన బాధితుల పరామర్శించి, వారి దీనస్థితిని చూసిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కరాల సురేఖ చలించిపోయారు. ఆరు రోజులుగా కురుస్తున్న  భారీ వర్షాలకు గోదావరి ఉదృతం గా ప్రవహించగా రాళ్లవాగు బ్యాక్ వాటర్ తో   ఎన్టీఆర్ నగర్ , రామ్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే.  శుక్రవారం  వారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఎన్టీఆర్ కాలనీ, రామ్ నగర్ లో నీట మునిగిన ఇండ్లను చూసి  ఆందోళనకుగురయ్యారు. వరద ముప్పు మిగిల్చిన నష్టాలను తెలుసుకొని ఆవేదన చెందారు. తాగడానికి , తినడానికి తిండి లేదని విద్యుత్ సరఫరా లేదని బాధితులను వారికి  మొరపెట్టుకున్నారు. కేవలం నలుగురు మున్సిపల్ సిబ్బంది మాత్రమే పారిశుద్ధ నిర్వాహణ పనులు చేస్తుండడంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని బాధితులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తో ప్రేమ్ సాగర్ రావు స్వయంగా చర్చించి, కనీసం 50 మంది సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. తాగునీరు సరఫరా కోసం సొంతంగా తాగునీటి ట్యాంకర్లను  ఎన్టీఆర్ కాలనీ, రామ్ నగర్ ఇతర ముంపు ప్రాంతాల్లోని బాధితులకు నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే చెత్తాచెదారం తొలగించేందుకు సొంత ఖర్చులతో కార్మికులను నియమించారు. ఇంట్లోని బురద నీరు బయటకు తొలగించడం  బాధితులకు కష్టతరం కావడంతో  ఫైర్ ఇంజన్ల ద్వారా నీటితో ఇళ్లను పరిశుభ్రం చేయాలని  ఆయన ఆలోచన చేశారు. వెంటనే అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో  ఆయన ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించగా అగ్నిమాపక వాహనాన్ని పంపేందుకు అంగీకరించారు.  రాంనగర్ లోని డూప్లెక్స్ అపార్ట్మెంట్లో జరిగిన భారి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం   వారు మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల తప్పిదం వల్ల వరద నష్టం జరిగిందని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం గోదావరి బ్యాక్ వాటర్ తో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతున్నాయని వారు తెలిపారు. వరద ముంపు గురైన బాధితులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగారని తెలిపారు. తాగునీరు అల్పాహారం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మాతా శిశు కేంద్రం గోదావరి తీరాన నిర్మించవద్దని మొరపెట్టుకున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పెడ చెవినపెట్టి భవనం  నిర్మించారని ఇప్పుడు అది వరద నీటిలో మునిగి పోయిందని   అన్నారు.  కాంగ్రెస్ శ్రేణులు అందులోని రోగులను వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువచ్చారని, లేకపోతే వారు వరద నీటిలో చిక్కుకుపోయేవారని వారు వివరించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తు లో  వరద నీరు ఇళ్లలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఆలోచన చేయాలని వారు సూచించారు. వరద బాధితులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందించడానికి ఏర్పాటు చేసినట్లు   వెల్లడించారు.