జీనియస్ 2022లో పాల్గొనేందుకు చివరి తేదీ డిసెంబర్ 31

Published: Tuesday December 21, 2021
పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు
బోనకల్, డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి : జీనియస్ 2022 పోటీలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవడానికి 31 డిసెంబర్ 2021 చివరి తేదీ అని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. బోనకల్ మండలం చొప్పకట్లపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలో పాల్గొనేందుకు తెలుగు వారందరూ అర్హులేనని తెలిపారు. వ్యక్తిలోని ప్రతిభను వెలికితీసేందుకు, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చొప్పకట్లపాలెం గ్రామంలోని తన్నీరు జగ్గయ్య విజ్ఞాన కేంద్రంలో 2021 నుండి జీనియస్ పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీనియస్ 2022 మొదటి భాగం పరీక్ష 9 జనవరి 2022న జరుగుతుందన్నారు. ఈ పోటీలో పాల్గొనదలచిన వారు రెండు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి తమ వివరాలను 9866925937 నెంబర్కు వాట్సాప్ చేయవలెను. జీనియస్ 2022 పూర్తి వివరాలు, ఇతర సందేహాలు నివృత్తి కోసం ఎంట్రీ ఫీజు చెల్లించిన వారందరికీ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరుగుతుందని పల్లా కొండల రావు తెలిపారు. మొదటి భాగం పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా టాప్ 20 మందిని సెలెక్ట్ చేసి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పది రౌండ్ల తో కూడిన జీనియస్ 2022 టేలెంట్ షో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో టాప్ గా నిలచిన పదిమందికి కలిపి వారు పొందిన మార్కుల ఆధారంగా 25 వేల రూపాయలను బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్టిఫికెట్ కూడా ఇవ్వడంజరుగుతుందని తెలిపారు. ఇదే సమయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థాయిలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బైపీసీలో ఖమ్మం జిల్లా ఫస్ట్ ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన శీలం గౌతమి కి సన్మానం ఆర్ధిక సహాయం అందజేత ఉంటుందని తెలిపారు. తెలంగాణ పోరాట యోధుడు బొప్పాల సీతారామయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు రమేష్, అజయ్ కుమార్ లతో పాటు గ్రామంలోని పలువురు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా జీనియస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్లా కొండల రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయినపల్లి అంజయ్య, కోశాధికారి కొండేటి అప్పారావులు పాల్గొన్నారు.