ముదిరాజ్ భవన్ మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Tuesday May 25, 2021

పటాన్చేరు, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చేరు పట్టణంలోని ముదిరాజ్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చేరు పట్టణంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తో పాటు, అంబేద్కర్ భవన్, మున్నూరు కాపు కళ్యాణ మండపం, యాదవుల కల్యాణ మండపం, షాదీఖానాలను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచిపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు నివర్తీదేవ్, ఎట్టయ్య, తులసీదాస్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.