మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యం

Published: Wednesday January 12, 2022
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజాపాలన : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మెరుగైన ర్యాంకును సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య హితవు పలికారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన 20వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ తో కలిసి వార్డు కౌన్సిలర్ జైదుపల్లి మురళి ఆధ్వర్యంలో తడి పొడి చెత్త వేరు చేయాలని అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో మరింత మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజీవ్ గృహకల్ప కాలనీలో మున్సిపల్ సిబ్బందితో కలిసి ర్యాలీగా తిరుగుతూ.. తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధించడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య, చైర్ పర్సన్ మంజుల రమేష్ లు మాట్లాడుతూ పారిశుద్ధ్యం పట్ల వికారాబాద్ మున్సిపల్ సిబ్బంది నిబద్ధతతో పని చేస్తుందని, పట్టణ ప్రజల సహకారం కూడా ఎంతో ఉందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్ది వచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో వికారాబాద్ మున్సిపల్ మరింత మెరుగైన ర్యాంకు సాధించడానికి మున్సిపల్ సిబ్బంది, కార్మికులు, పట్టణ ప్రజలు 100% సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జైదుపల్లి మురళి, కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.