ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Published: Friday January 20, 2023
* తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజా పాలన : ప్రజలకు  మెరుగైన వైద్య  సేవలు  అందించడంతో పాటు కంటి  సమస్యలను కూడా పరిష్కరించేందుకు కంటి  వెలుగు రెండవ విడత  కార్యక్రమాన్ని  చేపట్టిందని తాండూర్ శాసన సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. 100  రోజులు  పాటు  నిర్వహించే  ఈ కంటి  వెలుగు  కార్యక్రమాన్ని  ప్రతి ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని  గురువారం తాండూర్ పట్టణంలోని బస్తీ దవఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని   జిల్లా  కలెక్టర్ నిఖిల తో కలిసి తాండూరు  శాసన సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి   ప్రారంభించారు. ఈ సందర్భంగా  అయన  మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులతో పాటు కంటి అద్దాలు అందించడం జరుగుతుందన్నారు.  అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం హైదరాబాద్ లోని పెద్ద ఆస్పత్రులకు తరలించి 40 నుండీ 50 వేల ఖర్చును భరిస్తుందన్నారు. మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రికి తాండూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.  అందరు అంధత్వ రహిత తాండూర్ ఏర్పాటు కోసం ఈరోజు నుండి 100 రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి పలువురికి కంటి అద్దాల పంపిణీ గావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్ కుమార్, తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.