గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప

Published: Saturday December 10, 2022
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 9, ప్రజాపాలన :
 
చారిత్రాత్మకంగా ప్రసిద్ది చెందిన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర నిర్వహణ కొరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తామని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారిఖిల్లా మైసమ్మ దేవాలయాన్ని ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ పి. శ్రీజతో కలిసి సందర్శించి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల ఆరాధ్య దైవమైన మైసమ్మ జాతరకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ., ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఎంతో పవిత్రంగా నిర్వహించే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్రాగునీటితో పాటు మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు శాఖ సమన్వయంతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నాయక్పోడ్ సంఘాల సభ్యులు ప్రజల సౌకర్యం కోసం మెట్లు, రేకులషెడ్డు ఏర్పాటు చేయాలని కోరగా ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్మాణ ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ ఏ.ఈ. సాయి కృష్ణ, నాయక్ పోడ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేసినేని రాజయ్య, జిల్లా అధ్యక్షులు రాజన్న, సభ్యులు భీమ్రావు, రాజ్ కుమార్, అరుణ్, రమణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.