అధిక వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం

Published: Monday January 31, 2022
వికారాబాద్ జిల్లా ఎస్‌పి ఎన్.కోటి రెడ్డి ఐపిఎస్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజాపాలన : అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయదారులు, చిరు వ్యాపారస్తులు ఉన్నారని పేర్కొన్నారు. దీనిని అదునుగా తీసుకొని కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీ వసూలు చేసి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్గిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నదని వివరించారు. దీని వలన వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తులు అధిక వడ్డీ కట్టలేక  ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిని అరికట్టడానికి జిల్లా ఎస్పీ జిల్లా అధికారులకు వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టాలని సూచించారు. అధిక వడ్డీ వసూలు చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చర్య తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కల్గించిన వ్యక్తులను సహించేది లేదని జిల్లా ఎస్పీ ఘాటుగా హెచ్చరించారు. జిల్లాలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకొని, అవగాహన కల్పించి, అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వడ్డీ వ్యాపారస్తులు ప్రజలకు ఇబ్బంది కల్గించరాదని హితవు పలికారు. జిల్లా అధికారులకు  నేరాలపై మాత్రమే కాకుండా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారస్తులపై కూడా తమ నిఘా పెంచాలని ఆదేశించారు.