వర్షాకాలం.. జాగ్రత్తలే ముఖ్యం : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి

Published: Saturday July 30, 2022

శేరిలింగంపల్లి- ప్రజా పాలన/జూలై 22 :ఈ వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశమూ ఎక్కువగా ఉంటుందని, ఎన్నోరకాల రోగాలు తేలికగా ప్రబలే ప్రమాదముందని, వర్షాలతో ఇంటి చుట్టుపక్కల నీరు నిలుస్తుంది కాబట్టి దోమలు వ్యాప్తి చెందుతాయని దీంతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలుతాయని, అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని డాక్టర్ ఇషాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో దుప్పెల్లి వెంకటేశం ముదిరాజ్ సౌజన్యంతో ముద్రించిన కరపత్రాన్ని టీమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ సూపర్నెంట్, డాక్టర్ ఇషాన్ అహ్మద్ ఖాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే అతిసారం, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వ్యాధి, లాంటి అనేక వ్యాధులపై వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి కరపత్రాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. వ్యాధి చికిత్స కన్నా నివారణ మిన్న వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడే బదులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరు నిత్య వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అనారోగ్యంగా ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పెల్లి వెంకటేశం ముదిరాజ్, మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, పాలం శ్రీను, జనార్దన్, సాంబశివ గౌడ్, కోవూరి మరియూ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.