డైవర్షన్ రోడ్డుపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం: సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్

Published: Wednesday May 25, 2022
బోనకల్ మే 24 ప్రజా పాలన ప్రతినిధి : మండల కేంద్రంలో గల 118 రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. బ్రిడ్జి నిర్మాణ పనులు నడుస్తుండడంతో బోనకల్ నుండి ఆళ్లపాడు గోవిందపురం, రాయనపేట తదితర గ్రామాల ప్రజలు ప్రయాణించడానికి వీలుగా రావినూతల గ్రామం నుండి గల డొంక రోడ్డు కు మళ్లించారు.కానీ అదే డొంకరోడ్డు ప్రస్తుతం గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు.రాత్రీ వేళల్లో కొంతమంది ప్రయాణీకులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురైన దాఖలాలు కోకొల్లలు,సదరు రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కనీసం గుంతల్లో మరమ్మతులు కూడా చేయించక పోవడంతో ప్రయాణికులు పలురకాల ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.విషయంపై స్థానిక రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ మాట్లాడుతూ రావినూతల గ్రామ ప్రజలు వ్యవసాయ పనుల నిమిత్తం అదే డొంక రోడ్డు నుంచి వెళ్ళవలసివస్తుందని ప్రస్తుతం ఉన్న డొంక రోడ్డు ట్రాఫిక్ వలన పూర్తిగా పాడైపోయిందనీ వర్షాకాలంలో రైతు సోదరులు తీవ్ర ఇబ్బందులు ఎదుకొనవల్సి వస్తుందని,కాంట్రాక్టర్ కనీసం దారి మళ్లింపు సూచన చిహ్నాలు కూడా పెట్టలేదని తద్వారా ప్రయాణీకులు ఎటు వెళ్ళాలో కూడా తెలియని అయోమయంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇప్పటికైనా రైల్వే కాంట్రాక్టర్ స్పందించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.