కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా రాష్ట్ర ప్రభుత్వం డీఈఓ ఆఫీస్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నిరసన

Published: Thursday July 07, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై 06(ప్రజాపాలన, ప్రతినిధి) : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ విద్యాసంస్థలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నేటి వరకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల వైఫల్యమేనని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పూదరి సాయి, మండల అధ్యక్షుడు జాడి సాయి, సహాయ కార్యదర్శి రహీం, రవి కుమార్ లు పాల్గొన్నారు.