రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారా... ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

Published: Monday January 30, 2023

జగిత్యాల, జనవరి 29 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా సరఫరా చేస్తున్నారా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ నిర్ణీత వేళలు సరఫరా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొంది అన్నారు. యాదాద్రి నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అన్నారు. యాదాద్రి ప్లాంట్ తో రాష్ట్ర ప్రజలపై రు.40,000 కోట్ల భారం మోపారని ద్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు 300 యూనిట్ల కన్న తక్కువ వినియోగించుకున్న వారిపై ఏ సి డి చార్జీలు విధిస్తున్నారన్నారు. చరిత్రలో ఔరంగాజేబు జుట్టు పన్ను విధించారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ సామాన్యులపై ఎసిడి చార్జీలు విధిస్తున్నారని ఇది కేసీఆర్ పన్ను అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే నెపంతో సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల హక్కులను కాలరస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 110 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించలేనప్పుడు ఇంకెప్పుడు రక్షిస్తారని సీఎం కెసిఆర్ ను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను, వైఫల్యానికి కప్పి పుచుకునెందుకు నిరుపేదలపై ఏసీడీ చార్జీల పేరిట భారం మోపడాన్ని నిరసిస్తూ ఈనెల 31న జగిత్యాలలో విద్యుత్ సబ్ స్టేషన్  వద్ద ధర్నా చేపట్టనున్నమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.