మూసివేసిన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష

Published: Monday January 23, 2023

కోరుట్ల, జనవరి 21 (ప్రజాపాలన ప్రతినిధి):
మూసివేసిన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . మెట్ పల్లిలో శనివారంనాడు చెరుకు రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి , నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురిజెల రాజారెడ్డిలతో కలిసి తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగిత్యాల జిల్లాలోని ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకుండా తప్పించుకునే ధోరణిని అవలంభిస్తున్నారని ఆరోపించారు . చెరుకు రైతులు ఎన్నో రకాలుగా ఉద్యమాలను , నిరసన కార్యక్రమాలను చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏలాంటి స్పందన రాకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు . 2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూతపడ్డ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని వాగ్దానం చేసి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నాప్పటికీ ఆ హామీని నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండడంతో చెరుకు రైతులతో పాటు షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కార్మికులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని శేర్ నర్సారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు . కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి చెరుకు రైతులను ఆదుకోవాలని లేకపోతే తెలంగాణ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతుల మద్దతును కూడగట్టి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ సమావేశంలో తెలంగాణ రైతు ఐక్య వేదిక నాయకులు పుప్పాల నగేష్ , బద్దం శేఖర్ రెడ్డి , కోట రమేష్ , పుడుకారపు రవీందర్ రెడ్డి ,  తదితరులు పాల్గొన్నారు .