ఉద్యమ పోరాట యోధుడు పెద్ద అనంతయ్య: కూనంనేని సాంబశివరావు పెద్ద అనంతయ్య చిత్రపటానికి నివాళుల

Published: Thursday July 14, 2022
బోనకల్, జులై 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు కిలారి పెద్ద అనంతయ్య చిత్రపటానికి బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లతో కలిసి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో గోవిందాపురం, లక్ష్మీపురం గ్రామాలకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. రావెళ్ల జానకిరామయ్య వద్ద శిక్షణ పొందిన మల్లెల వెంకటేశ్వర్లు ఈ ప్రాంతంలో దళనాయకుడిగా ఉండి అనేక పోరాటాలకు రూపకల్పన చేశారన్నారు. ఆ పోరాటాల్లో చిన్న, పెద్ద, ముసళి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని పోరాటాన్ని బ్రతికించారని ఆయన కొనియాడారు. నాడుచిన్నపిల్లవాడిగా ఉండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిలో కిలారి పెద్దఅనంతయ్య ఒకరన్నారు. రజాకార్లు ఏడుగురి వీరులను హత్య గావించి ఒకే చితిపై కాల్చివేసిన సంఘటనకు పెద్ద అనంతయ్య ప్రత్యక్ష సాక్షి నన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సిపిఐ, సిపిఎం మండల కార్యదర్శులు యంగల ఆనందరావు, దొండపాటి నాగేశ్వరావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి జక్కుల రామారావు, సిపిఎం సీనియర్ నాయకులు ఉమ్మినేని కోటయ్య, నాయకులు ఉమ్మినేని రవి, కారంగులు చంద్రయ్య, టిడిపి నాయకులు వల్లకొండ వెంకటరామయ్య, సానుభూతి పరులు, ఇతర పార్టీల నాయకులు తదితరులున్నారు.
 
 
 
Attachments area