అభివృద్ధికి ఆమడదూరంలో కొత్త గ్రామపంచాయతీలు

Published: Tuesday November 22, 2022
రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు కొనింటి సురేష్
వికారాబాద్ బ్యూరో 21 నవంబర్ ప్రజాపాలన : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 4383 గ్రామపంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేశ్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. నూతన గ్రామపంచాయతీలు సమస్యల లోగిళ్లుగా మారాయని, గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు లేవని తెలిపారు. పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పలు గ్రామాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారని, గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొలువుదీరి నాలుగేళ్లు గడిచినా.. అభివృద్ధి పనులు చేయడం వారికి సవాల్‌గానే మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పంచాయతీలు అయితేనే అభివృద్ధి మరింతగా సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం 500 మంది జనాభా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయగా గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నాయని అన్నారు. గ్రామాభివృద్ధి పనులకొరకు ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా జిల్లా పరిషత్ నిధులు నేటివరకూ కనీసం ఒక్క రూపాయి కూడా కెటాయించకపోవడం విచారకరమని అన్నారు. నిధులు లేకపోయినా పై అధికారులు ఏటా  రెండుసార్లు పల్లెప్రగతి పేరిట సర్పంచులపై అజమాయిషీ చేస్తూ ఇప్పటివరకు రూ.10-30 లక్షల వరకు అభివృద్ధి పనులు చేయించడంతో బిల్లులు రాక చాలామంది సర్పంచులు అప్పులపాలయ్యారని తెలిపారు. ప్రతినెలా గ్రామపంచాయతీలకు కెటాయిస్తున్న నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్, కరెంటు బిల్లులకే సరిపోవడం లేదని అన్నారు. జీతాలు లేక ట్రాక్టర్ డ్రైవరు, సఫాయి కార్మికులు పనులకు రావడంలేదని చెప్పారు. కొత్త గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సురేశ్ డిమాండ్ చేశారు.