ప్రార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులే మిన్న: భువనగిరి రోటరీ క్లబ్

Published: Thursday November 11, 2021
యాదాద్రి జిల్లా నవంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి : రొటేరియన్ మాజీ గవర్నర్ డాక్టర్.తిరునగరి రంగయ్య గారి 94వ పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్ లోని అమ్మ నాన్న అనాధల పుణ్య క్షేత్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పోర్టు ఆద్వర్యంలో మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం మరియు దుస్తుల పంపిణీ చేశారు. న్యూ క్లబ్స్ తెలంగాణ రీజియన్ చైర్మన్ డాక్టర్.ఎంపల్ల బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... ప్రార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులే మిన్న అనే నానుడి నిజమన్నారు. ఇతరులకు  సలహాలు ఎన్నైనా చెప్పవచ్చు మొదలు మనం ఆచరణలో పెట్టి నిరూపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కని పెంచిన తమ పిల్లలు వృద్ధాప్యం లో తల్లిదండ్రులను  అనాధలుగా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించిన ఆశ్రమ దాతలను కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పోర్టు వారు కేపాల్ బోన్ సెట్టింగ్ హాస్పిటల్, వై.యస్.ఆర్ ఏ/సి గార్డెన్స్ భువనగిరి వారి దాతృత్వంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆశ్రమ వాసులు మరియు పలువురు వక్తలు డాక్టర్.తిరునగరి రంగయ్యకు 94వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పోర్టు సేవలను పలువురు వక్తలు కొనియాడారు. అధ్యక్షుడు మందడి వెంకట్ రెడ్డి, కార్యదర్శి జిట్ట భాస్కర్ రెడ్డి, మెంబర్ బచ్చు నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.