ఈనెల 16న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష

Published: Saturday October 15, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 14 అక్టోబర్ ప్రజా పాలన : అక్టోబర్ 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో  సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో  జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ పాటించవలసిన నియమ, నిబంధనల విషయమై చీఫ్ సూపరింటెండెంట్ లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 14 పరీక్షా కేంద్రాల్లో 4857 మంది పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షలు బయో మెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 8-30  గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని,  10 గంటల 15 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోనికి ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని తెలిపారు.  హాల్ టికెట్ తో పాటు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్, ప్రభుత్వ గుర్తింపు కార్డ్ లలో (పాన్ కార్డు ,ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ,డ్రైవింగ్  లైసెన్స్ పాస్ పోర్ట్) ఏదైనా ఒకటి తీసుకొని రావాలని సూచించారు. హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా ప్రింట్ కాని అభ్యర్థులు గెజిటెడ్ అధికారితో సంతకం చేసిన 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు.  పరీక్ష కేంద్రంలో రైటింగ్ ప్యాడ్ లు, మొబైల్ ఫోన్, క్యాల్క్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, తీసుకొచ్చినట్లయితే ఇట్టి వస్తువులను భద్రపర్చుటకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి, షూ ధరించి రావద్దనీ సూచించారు. ఓఎంఆర్ జవాబు పత్రంపై వైట్నర్/చాక్ పవర్/బ్లేడ్/ఎరేజర్ ఉపయోగించడం నిషేధమని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులెవరు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరని సూచించారు. 
పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు బెంచీలు, టేబుల్స్, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్, త్రాగు నీటి సదుపాయం, స్త్రీ పురుషులకు విడివిడిగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చీఫ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు.  బయోమెట్రిక్ తరువాతనే అభ్యర్థులకు లోపలికి వదలాలని సూచించారు.  చీఫ్ సూపరింటెండెంట్ రూంలో ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దానితో పాటు వీడియో కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్ష మొదలు నుండి పూర్తి అయ్యే వరకు రికార్డు చేయాలన్నారు.  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -1 పరీక్షలను ఎలాంటి తప్పులు దొర్లకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఈ సందర్బంగా కోరారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, ఆర్ డి ఓ విజయకుమారి, పరీక్షా నిర్వహణ పర్యవేక్షకుడు రవీందర్ దత్తు, పరీక్షల చీఫ్ 
సూపరింటెండెంట్లు, టి ఎస్ పి ఎస్ సి ప్రతినిధులు సుష్మ, జయభారతి తదితరులు పాల్గొన్నారు.