మధిర నియోజకవర్గంలో పోటీ చేసే శీనన్న అభ్యర్థులు ఎవరు?

Published: Tuesday January 03, 2023
జెండా ఏదైనా శీనన్న అభ్యర్థుల పోటీ ఖాయం*రేసులో డాక్టర్  రాంబాబు, ఉద్యమ నేత బొమ్మెర*
మధిర జనవరి 2 (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శీనన్న అనుసరించబోయే వ్యూహన్ని ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శీనన్న అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శీనన్న వైఖరిని బట్టి చూస్తే తనను ఆదరించిన పార్టీని జిల్లాలో ఆదరణ లేకుండా చేయటమే లక్ష్యంగా కనిపిస్తుంది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి భారీ స్థాయిలో అనుచరులు కలిగి ఉండటంతో పాటు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. పొంగులేటికి మధిర నియోజకవర్గంలో మరి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధిర నియోజకవర్గంలో పోటీ చేసిన లింగాల కమల్ రాజు గెలుపు కోసం భారీ స్థాయిలో కృషి చేశారు దీంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలను పొంగులేటి నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎవరిని బరిలో దింపుతారని నియోజకవర్గ ప్రజల్లో చర్చ మొదలైంది. టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు బమ్మెర రామ్మూర్తి 2014లో  టిఆర్ఎస్ అభ్యర్థిగా మధిర అసెంబ్లీ నుండి పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎల్ఎఫ్ నుండి డాక్టర్ కోటా రాంబాబు పోటీ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం పొంగలేటి  అనుచరులుగా మధిర నియోజకవర్గంలో కొనసాగుతున్నారు. ఇరువురూ మాదిగ సామాజిక వర్గంలో బలమైన నేతలుగా ఉన్నారు. వీరిలో ఒకరి మధిర నుండి శీనన్న అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని కలిసి వస్తే వీరిలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మరొకరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు సైతం ఉన్నట్టు చర్చ నడుస్తుంది. మరో ఆరు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో శీనన్న హాట్ కామెంట్స్ తో మధిర రాజకీయం వేడెక్కింది.