అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

Published: Monday August 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 ఆగస్ట్ ప్రజాపాలన : సోదర సోదరీ మణుల మధ్య ఆత్మీయత అనుబంధం పెంచేదే రక్షాబంధన్. శ్రావణ పూర్ణిమ చాలా దైవీ శక్తులతో కూడిన తిథి. తోబుట్టువులచే రక్షాబంధనం పొందడం భారతీయ సంస్కృతీ సాంప్రదాయంలో భాగంగా వస్తున్నది. ఆదివారం వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజక వర్గాల్లో రాఖీ పౌర్ణమి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి రాఖీ పౌర్ణమి చిహ్నం. అక్కా చెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం రక్షాబంధన్. ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అనే భావన కలుగుతుంది. సోదరిచేత కట్టబడిన రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుందని ప్రగాఢ విశ్వాసం. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వగృహంలో ఎమ్మెల్యే తల్లి మెతుకు సాయమ్మ సమక్షంలో సోదరీమణులు సత్యమ్మ, అనంతమ్మలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కూతురు మెతుకు వినూత్న తన సోదరుడైన మెతుకు వైభవ్ కు రాఖీ కట్టి శుభాభినందనలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వికారాబాద్ ఎమ్మెల్యే తన నియోజకవర్గ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.