ధారూర్ మండల పరిధిలో భారీ వర్షాలతో రాకపోకలు స్థంభించాయి : ములుగు ఎమ్మెల్యే సీతక్క

Published: Monday September 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజాపాలన : నాసిరకమైన రోడ్ల నిర్మాణం కారణంగానే భారీ వర్షాలతో రోడ్లు తెగిపోయాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆదివారం ధారూర్ మండల కేంద్రంలోని తాండూర్ వికారాబాద్ మధ్య  గల ప్రధాన రహదారిలో ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పోరాట దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి, వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, ఎంపిపిళకామిడి చంద్రకళలు హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనా ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం శోచనీయమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖశాంతులతో బతికారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ పుణ్యమేనని స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గం ధారూర్ మండల పరిధిలోని పలు రహదారులు వరద ఉధృతికి తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాగులకు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరే క్రమంలో వరద వాగుదాటే ప్రయత్నం చేశారని వివరించారు. వాగుదాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకొనిపోయి మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణం సక్రమంగా జరిగి ఉంటే ఈ దుర్భర పరిస్థితి వచ్చేది కాదని ఎత్తిచూపారు. ఈ కార్యక్రమంలో ధారూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు‌, నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.