దళిత బంధు పథకం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Friday February 04, 2022
వికారాబాద్ బ్యూరో 03 ఫిబ్రవరి ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల వెరిఫికేషన్ ఈరోజు పూర్తి చేయాలని స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లు, యంఎఓ లు, ఎపియం లను జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నుండి సంబంధిత అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల చొప్పున మొత్తం నాలుగు వందల మంది లబ్దిదారుల జాబితా సంబంధిత శాసన సభ్యులు అందజేసిన ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు వారి వివరాలను పరిశీలించేందుకు వెరిఫికేషన్ టీమ్ లు ఈరోజు ఆయా గ్రామాలను సందర్శించి పూర్తి వివరాలు సేకరించి రేపటి వరకు అందజేయాలని కలెక్టర్ సూచించారు.  వెరిఫికేషన్ టీమ్ లో బ్యాంకు మేనేజర్లు కూడా ఉండాలని, దళిత బంధు కొసం లబ్ధిదారులకు బ్యాంకర్లు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలని సూచించారు. తహసీల్దార్లు అవసరమైన క్యాస్ట్, ఆదాయ దృవ పత్రాలను మీ - సేవా ద్వారా వెంటనే అందించాలన్నారు.  ప్రభుత్వం జారీ చేసిన ఫార్మేట్ ప్రకారము లబ్ధిదారుల కుటుంబ వివరాలు సేకరించాలన్నారు. సేకరించిన వివరాలన్నీ రేపటి వరకు స్పెషల్ ఆఫీసర్లకు అందజేయాలని సూచించారు. లబ్ధిదారులు 60 సంవత్సరాలు పైబడి ఉండరాదని అలాగే యస్సి కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల ఋణం పోంది ఉండకూడదని, ఇట్టి వారు ఈ పథకానికి అర్హులుకారని కలెక్టర్ తెలిపారు. తహశీల్దార్ల పూర్తి పర్యవేక్షణలో ఫార్మాట్ ప్రకారంగా ఈ వెరిఫికేషన్ పనులు పూర్తి చేసి రేపటి వరకు నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇడి యస్సి కార్పొరేషన్ బాబూమోజెస్, డిఆర్డిఓ కృష్ణన్, ఎల్డియం రాంబాబు, డీపీవో మల్లారెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.