మహిళల ఆర్థిక సాధికారత తోనే దేశ అభివృద్ధి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Saturday October 29, 2022
శ్రీరాంపూర్ అక్టోబర్ 28: ప్రజా పాలన
దేశ జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సింగరేణి గార్డెన్స్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, సెర్ప్, మెప్మా వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రుణ వితరణ కార్యక్రమానికి హాజరై స్వయం సహాయక సంఘాల సభ్యులకు 35 కోట్ల రూపాయల విలువ గల రుణ సంబంధిత చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు 358 కోట్ల రూపాయలను కేటాయించగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి 253 కోట్ల రూపాయలను అందించడం జరుగుతుందని, ఇందులో భాగంగా శుక్రవారం రోజున 30 కోట్ల రూపాయలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి, ఐదు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అందించడం జరిగిందని తెలిపారు. ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యాలలో భాగంగా ఇప్పటికే 60 శాతం సాధించడం జరిగిందని, రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు సకాలంలో తిరిగి చెల్లించడంతో లక్ష్యసాధన జరుగుతుందని, ఇదే తరహాలో రుణాలు పొందిన సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ అరుణ చెల్లింపులు చేయడం ద్వారా  మరింత అభివృద్ధి సాధించవచ్చు అని తెలిపారు. రుణ గ్రహీత సంఘాల సభ్యులు చిన్న పరిశ్రమలు, వ్యాపారాలైన కంగన్ హాల్, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్, క్లాత్ స్టోర్స్, కూరగాయల అమ్మకం లాంటి వాటి స్థాపన ద్వారా ఆర్థిక స్వావలంబన పొందాలని తెలిపారు. మహిళలు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీ, సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని, పోటీ ప్రపంచంలో భవిష్యత్తు కాలం సాంకేతికతపై  ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇంటి నుండి చిరు వ్యాపారాలు కొనసాగించవచ్చని, కుటుంబ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని, మహిళల సమిష్టి కృషితో జిల్లా యొక్క ఉత్పత్తి సామర్ధ్యం పెంచే విధంగా చూడాలని, జిల్లాలో ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ఎన్.పి.ఏ. 1.75 శాతంగా ఉందని, ఇతర రుణాల ఎన్.పి.ఏ. 4.69 శాతం కంటే చాలా తక్కువగా ఉందని, 0 కు చేరుకునే విధంగా ఋణ సదుపాయం పొందిన ప్రతి ఒక్కరూ సకాలంలో తిరిగి చెల్లించే విధంగా ఒక గ్రూప్ కి సంబందించిన సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం స్వయం సహాయక సంఘల ఋణాలలో 70 శాతం పైగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారానే ఇవ్వడం జరుగుతుందని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.శేషాద్రి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ కె.వి.ప్రసాద్, రీజనల్ మేనేజర్ మురళి మనోహర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఏ.పి.డి. శ్రీనివాస్, పి.డి. మెప్మా బాలకృష్ణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సత్యవతి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు  తదితరులు పాల్గొన్నారు