అంబరాన్నంటిన సంబరాలు

Published: Monday June 28, 2021
వికారాబాద్, జూన్ 27, ప్రజాపాలన బ్యూరో : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథసారధిగా మల్కాజిగిరి ఎంపి ఎనుముల రేవంత్ రెడ్డిని నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని పట్టణ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బిజెఆర్ కూడలిలో టిపిసిసి అధ్యక్షునిగా ఎనుముల రేవంత్ రెడ్డిని నియమించినందుకు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి నినాదాలతో బాణసంచా కాలుస్తూ సంతోషంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు నేటి దినం శుభదినము అని ప్రశంసించారు. డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి బూస్టులాంటి నాయకునికి బాధ్యతలు అప్పగించడం శుభపరిణామని ప్రశంసించారు. అధికార పక్షాన్ని నిలదీసే నిఖార్సైన నాయకునికి టిపిసిసి పదవి దక్కడం అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథ సారధిగా ఎనుముల రేవంత్ రెడ్డిని నియమించిన AICC అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్ లకు కృతజ్ఞతలు తెలుపారు. ప్రజా సమస్యలను గళమెత్తి వినిపించే నాయకుడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, దీనిని భూస్థాపితం చేయబూనడం అసాధ్యమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అబద్ధపు, బూటకపు కేసులను టిఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేస్తుందని ఆరోపించారు. తప్పుడు కేసులు నమోదు చేసి కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇప్పటి వరకూ మంజూరు చేయించకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రాబోవు రోజుల్లో నూతన రథసారథి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ కిషన్ నయక్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ రెడ్యానాయక్ వికారాబాద్ ఎంపీపీ కామెడీ చంద్రకళ డి సి సి జాయింట్ సెక్రటరీ గాండ్ల శివానందం బ్లాక్ అధ్యక్షుడు అనంత రెడ్డి దళిత కాంగ్రెస్ కన్వీనర్ పెండ్యాల అనంతయ్య సీనియర్ నాయకుడు కమల్ రెడ్డి ఇ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి శంకర్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ జాఫర్ రహీం చింతల శేఖర్ గుప్తా కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.