మేకలకు గొర్రెలకు నట్టల మందు వేయించుకోవాలి

Published: Saturday August 07, 2021
పులుసుమామిడి సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 ఆగస్ట్ ప్రజాపాలన : పశుపోషణ ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని పులుసుమామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలో గల పులుసు మామిడి గ్రామంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు, మేకలకు గొర్రెలకు నట్టల మందు వేసే కార్యక్రమాలను కార్యదర్శి రాములు, విఎల్ఓ సురేందర్ నాయక్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మా నీళ్ళు మా నిధులు మా నియామకాలు మాకే కావాలని ఆంధ్ర పాలకులతో వీరోచితంగా పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని గుర్తు చేశారు. తాగు సాగు నీటికి ఏ ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యమే స్వరాష్ట్ర సాధన అని వివరించారు. గ్రామంలో మేకలు గొర్రెలు కాసే యజమానులు తప్పకుండా నట్టల మందు వేయించాలని కోరారు. పశు సంపద ఎంత బాగుంటే ఆ గ్రామం ఆర్థికంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.