మండల, పట్టణ పోలీసు స్టేషన్లుగా ఏర్పాటు చేయాలి

Published: Monday February 13, 2023
* జైదుపల్లి, గోదంగూడ, సర్పన్ పల్లి, రాళ్ళచిట్టంపల్లి గ్రామాలను మార్చాలి
* మండల, పట్టణ పోలీస్ స్టేషన్లుగా  ఏర్పాటు చేయాలి
* పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని కూల్చి కొత్తగా నిర్మించాలి
* ధారూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ పూర్తి చేయాలి
* అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నావళిని సంధించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 12 ఫిబ్రవరి ప్రజాపాలన : నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అపరిస్కృత సమస్యలు ఏమేమి ఉన్నాయో పక్కాగా తెలిసి ఉండాలి. అప్పుడే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. అపరిష్కృత సమస్యలను ఎక్కడ ప్రస్తావిస్తే పరిష్కారమవుతుందో ఆలోచించగలగాలి. సరైన వేదికను ఎంచుకొని అపరిస్కృత సమస్యల చిట్టాను పకడ్బందీగా శాసనసభలో తన ప్రశ్నావళిని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రామబాణంలా సంధించారు. శనివారం రాత్రి ప్రశ్నోత్తరాల సమయము తనకు వచ్చిన అవకాశాన్ని శాసనసభ అధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా సంబంధిత మంత్రికి విన్నవించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలు జైదుపల్లి, గోధంగూడ, సర్పన్ పల్లి, రాళ్ళచిట్టంపల్లి ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాలు వికారబాదుకు దగ్గరగా ఉండడంతో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనికి మార్చాలని గతంలో కూడా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. వీలైనంత తొందరగా ఈ నాలుగు గ్రామాలను ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుండి వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనికి మార్చాలి. వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యింది. జనావాసాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. కావున వికారాబాద్ మండలం, వికారాబాద్ పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఉండడంతో పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలానికి, పట్టణానికి వేరువేరు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలను పరిరక్షించడానికి పోలీసులకు అనుకూలంగా ఉంటుంది. వీలైనంత తొందరగా వేరువేరు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ భవనం నుండి నూతనంగా నిర్మించిన భవనంలోనికి మార్చారు. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరింది. దానిని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు. ధారూర్ మండల పరిధిలో గల సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్ అసంపూర్తిగా ఉంది. త్వరగా దాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.