ఎమ్మెల్సీ అభ్యర్థి మారెంపల్లి లక్ష్మి నారాయణను గెలిపించండి

Published: Monday January 09, 2023
* ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానయ్య
వికారాబాద్ బ్యూరో 8 జనవరి ప్రజా పాలన :
ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందని ఎస్సి,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానయ్య అన్నారు. ఆదివారం 
వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లి పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం బహుజన సంఘమని, జహుజన బిడ్డల కోసం పోరాటం చేస్తుందని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి,పాలమూరు మూడు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మారేంపల్లి లక్ష్మీ నారాయణను ప్రకటించారన్నారు. ఉపాధ్యాయులు అందరూ ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు బహుజన బిడ్డలే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల పై శ్రద్ధ చూపించే ఎమ్మెల్సీ లేకుండా పోయారని విమర్శించారు. తమ అభ్యర్థిని బరిలో దింపినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి మారేంపల్లి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే విధంగా పాటు పడతామని అన్నారు.75 సంవత్సరాలు గడిచిన ఎస్సి,ఎస్టీ,బిసి ఎమ్మెల్సీ లేకపోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ బడులు మూతపడే అవకాశాలు లేకపోలేదని,దానిని పునరుద్ధరణ చేస్తామని అన్నారు. పాఠశాలలో కనీసం మౌలిక వసతులు కరువు అయ్యాయని,వాటిని మళ్ళీ వాడుకలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.శాసన మండలిలో గొంతును అవుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు పెంట అంజయ్య,నాయకులు నరేందర్, విష్ణు,అశోక్,భగవాన్ కృష్ణ తదితరులు ఉన్నారు.