తెలంగాణ విలీన దినోత్సవాలపై బిజెపి దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్

Published: Monday September 12, 2022
బోనకల్, సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ విలీన దినోత్సవంపై బిజెపి దుష్ప్రచారాలను కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సిపిఎం మధిర నియోజకవర్గస్థాయి పూర్తి కాలం కార్యకర్తల, ముఖ్య నాయకుల సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946ల ప్రారంభమై 1951 వరకు కొనసాగింది అన్నారు. ఇందులో కీలక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం ఎస్టేట్ విలీనం కావడం చారిత్రక వాస్తవం అన్నారు. ఆనాటి ఉద్యమంతో నాయకులు సాయుధ పోరాటంపై నేటికీ వక్ర భాష్యాలు చేస్తూనే ఉన్నాయన్నారు. విముక్తి, విమోచన, విలీనం, విద్రోహం అంటూ ఎవరికి తోచిన నినాదాన్ని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు వివరించాలనే బాధ్యతతో ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు నైజాం సర్కారు భూములను, జమీందారుల భూములను, సాగు చేసిన తర్వాతనే తమ భూములు సాగు చేసుకోవాలని లేనియెడల రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. 1946లో పాలకుర్తి లోనే ఐలమ్మ పంటను కోసుకుపోవటానికి జమీందారు విసునూరి రామచంద్రారెడ్డి తన గుండాలను పంపాడు. అప్పటికే సంఘంలో చురుకుగా పనిచేస్తున్న భీమిరెడ్డి నరసింహారెడ్డి, చకిలం యాదగిరి, చల్లా ప్రతాపరెడ్డి, కే రామచంద్రారెడ్డి నాయకత్వాన 30 మంది ఆ గుండాలను తరిమికొట్టారన్నారు. మొదటిసారి జమీందారీ గుండాలను తరిమికొట్టిన ఉత్సాహంతో సీతారాంపురం నుంచి 200 మంది ఊరేగింపుగా బయలుదేరారన్నారు. 1946 జూలై 4న జరిగిన ఊరేగింపు పై నిజాం సైనికులు, రజాకారు గుండాలు తుపాకులతో కాల్పులు జరిపారన్నారు. ఈ కాల్పుల్లోనే మొట్టమొదటగా దొడ్డి కొమరయ్య మృతి చెందాడు అన్నారు. ప్రజలు వెనుకడుగు వేయకుండా విసునూరి రామచంద్ర రెడ్డి గడీపై దాడి చేశారన్నారు. ఈ పోరాటంలో హిందూ, ముస్లింలే కాక అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారన్నారు. కానీ కొంతమంది ఈ పోరాటంలో పాల్గొన్న వారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంతో ఎటువంటి సంబంధం లేని బిజెపి, ఆర్ఎస్ఎస్ విముక్తి, విమోచన, అంటూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందన్నారు. ఈ ప్రచారాలను గ్రామాలలో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ఏ వర్గం నుంచి వచ్చినా తమ ఆస్తులు దానం చేయడమే కాక తాము ప్రాణాలు చేతులు లెక్కచేయకుండా నాయకత్వం వహించి నైజం దుష్ట పాలనను, జమీందారీ విధానాన్ని రద్దు చేయించడమే కాక భారతదేశంలో విలీనం చేయించారన్నారు. నాటి పోరాటంతో ఎలాంటి సంబంధం లేని వారు నేడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పోరాటానికి మత రంగు పులిమి ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. సెప్టెంబరు 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయటానికి జిల్లా, మండల స్థాయిలో సదస్సులు, సభలు, సమావేశాలు, సెమినార్లు, ర్యాలీలు జరిపి ప్రజలందరికీ చారిత్రక వాస్తవాలను వివరించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాల నిర్వహించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే పార్టీ విస్తరణ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, శీలం నరసింహారావు, సిపిఎం బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు, దివ్యల వీరయ్య, మడిపల్లి గోపాలరావు, నాయకులు బంధం శ్రీనివాసరావు, వత్సవాయి జానకి రాములు, మద్దాల ప్రభాకర, తుళ్లూరు రమేష్, మందడపు శ్రీనివాసరావు, పడకంటి మురళి, కూచిపూడి మురళీకృష్ణ, ఏడు నూతల లక్ష్మణరావు, టీఎస్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.