అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించాలి

Published: Tuesday June 01, 2021

సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క
మధిర మే 31 ప్రజా పాలన ప్రతినిధిన న్యూస్ అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం మధిర మీడియా మరియు అధికారులతో భట్టి విక్రమార్క జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కరోనాపై అధికారులను, డిక్టర్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధిరలో రోజుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారు? ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తున్నారు? కరోనా చికిత్స చేసేందుకు మధిరలో ఎన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు? ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగుల నుంచి బిల్లులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకుంటున్నారా? మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు? గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల్లో  ఉన్న రోగులకు భోజనం ఎవరు పెడుతున్నారు? తదితర అంశాలపై  అధికారులను, డాక్టర్లను ప్రశ్నించారు. దీనికి తహసీల్దార్ సైదులు ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి సివిల్ ఆస్పత్రి ఇంఛార్జి అనిల్ కుమార్, ఈవో ఆర్ డి రాజారావు సమాధానమిస్తూ రోజుకి 150 మందికి కరోనా పరీక్షలు చేయడం జరుగుతుందని, మధిరలో మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. బిల్లులు  విషయంపై ఉన్నతాధికారుల నుండి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది కొరత బాగా ఉందని, కోవిడ్ వార్డులో ఏర్పాటుచేసిన 20 బెడ్లు సరిపోవడం లేదని వాటిని 50 బెడ్లుకు పెంచాలని డాక్టర్లు వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కరోనా సోకి సీరియస్గా ఉన్నవారిని ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, రిఫర్ చేసినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు బెడ్ దొరికేవరకు మండల కోవిడ్ టీమ్ పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బ్లాక్  ఫంగస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు సమావేశంలో మాటూరు పేట వైద్యులు వెంకటేష్ పాల్గొన్నారు.