ఆన్లైన్ లోన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ

Published: Thursday August 04, 2022
కరీంనగర్  క్రైం  ఆగష్టు 3  ప్రజాపాలన:
 ఆన్లైన్ లోన్ యాప్ ల పట్ల అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. ప్రజల అవసరం, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లోన్ యాప్ ల నిర్వహకులు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ఆన్లైన్ లోన్ యాప్ ల మోసాలపై పై అవగాహన కల్పిస్తూ కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న ఇన్విటేషనల్  క్రికెట్ పోటీలను బుధవారం నాడు పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఆన్లైన్ యాప్ లను వినియోగించకూడదన్నారు. ప్రజలను పూర్తిస్థాయిలో మోసం చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు కాబడ్డాయని పేర్కొన్నారు.  దేశ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో మకాం వేసి ఉండి మోసాలకు పాల్పడి ఇతర దేశాలకు తప్పించుకుని పారి పోతున్నారని చెప్పారు. ఆన్లైన్ యాప్ ల పై కమిషనరేట్ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కొందరు స్వల్ప వ్యవధిలో రుణాలను ఆశించి అధిక వడ్డీలను చెల్లిస్తూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆన్లైన్ రుణాలు, సైబర్ మోసాలకు గురైన ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
  ఈ పోటీల్లో 15 జట్లు పాల్గొననున్నాయి. ప్రారంభ మ్యాచ్ కమిషనరేట్ ఎలెవన్, జిల్లా అగ్నిమాపక శాఖ జట్ల మధ్య జరిగింది.
 ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి లు ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన) ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, ప్రతాప్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, రమేష్, సురేష్, మురళి లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
 
పోలీస్ కమిషనర్ ఎలెవన్ విజయం
 
 బుధవారం నాడు జరిగిన ప్రారంభ మ్యాచ్లో పోలీస్ కమిషనర్ ఎలెవన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ ప్రారంభించిన అగ్నిమాపక శాఖ నిర్ణిత 20 ఓవర్లలో 111 పరుగులను సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కమిషనర్ ఎలెవెన్ జట్టు 12 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని సాధించింది. పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ 29 బంతుల్లో 24, అడిషనల్ డీసీపీ జి చంద్రమోహన్ 31 బంతుల్లో 35, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ 14 బంతుల్లో 35 ఎంటిఓ రమేష్ 8 బంతుల్లో 7 పరుగులను సాధించారు.