మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలకు మరమత్తులు చేయాలి

Published: Wednesday August 04, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 03 ఆగస్ట్ ప్రజాపాలన : మిషన్ భగీరథ పైపులైన్ను కాంక్రీటుతో పూడ్చాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఉదయం 7 గంటల నుండి బార్వాద్ తండా సర్పంచ్ కవితా మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కోట్ పల్లి మండలంలోని బార్వాద్ తండా, మద్గుల్ తండాలలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి పై ఉన్న మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ ను కాంక్రీట్ తో కనిపించకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాల్లో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలను వెంటనే మరమత్తులు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న మట్టి కుప్పను తీసి ప్రజల రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టిని తరచుగా శుభ్రం చేయాలని పంచాయతీ సెక్రటరీకి సూచించారు. ఇంటి పైన ఉన్న కరెంట్ తీగలను వెంటనే తొలగించి కొత్త కరెంటు తీగలను ఏర్పాటు చేయాలని అన్నారు. గత పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం మా గ్రామంలో నూతన కరెంట్ పోల్స్ వేయించి ఇబ్బంది లేకుండా చేశారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శానిటేషన్, డ్రైనేజ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, వాటిని శాశ్వతంగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. మిషన్ భగీరథ నల్లాలను తీయకుండా గ్రామ ప్రజలందరూ కలిసి తీర్మానం చేసుకోవాలన్నారు. అతిక్రమించిన వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ ట్యాంక్ పైన కప్పును ఏర్పాటు చేసి తరచుగా శుభ్రం చేయాలన్నారు. గ్రామం మధ్యలో ప్రమాదకరంగా ఉన్న బావి పైన జాలి ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
బార్వాద్ తండా వాసులు గులాబీ గూటికి : మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండలం బార్వాద్ తండా గ్రామ పంచాయతీకి చెందిన ఇతర పార్టీ నాయకులను పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎంపిపి నల్లోల్ల శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బంట్వారం పిఏసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి‌, రైతు బంధు అధ్యక్షుడు సత్యం, ఉప సర్పంచ్ బాబూ నాయక్, వైస్ ఎంపిపి ఉమాదేవి, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.