కేశవపట్నం గ్రామంలో రసాభాసగా మారిన గ్రామసభ శంకరపట్నం జనవరి 12 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Friday January 13, 2023

శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో గ్రామ సర్పంచ్ బండారి స్వప్న ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గురువయ్య మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో గ్రామ ప్రజలకు కంటి పరీక్ష, ఉచిత కంటి అద్దాలు ప్రభుత్వం అందజేయనుందని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ బండారి స్వప్న మాట్లాడుతూ గ్రామంలో  చేసిన వివిధ పనులకు ప్రభుత్వం నుండి నిధులు విడుదల  కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే  నిధులు రాక నానా అవస్థలు పడుతున్నట్టు ఆమె తెలిపారు. గ్రామంలోని వివిధ సమస్యలపై గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నిధులు విడుదల కాకపోవడమే సాకుగా చూపిస్తూ సమస్యలపై  సమాధానాలను దాటవేసే ధోరణిలో  పాలకవర్గం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆరోపించారు. మండల కేంద్రమైన కేశపట్నం గ్రామంలో రోడ్లు ఇరుకుగా మారి రెండు వాహనాలు ఒకేసారి పోలేని పరిస్థితి ఏర్పడిందని దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ గ్రామపంచాయతీ పాలకవర్గం అధికారులు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పాలకవర్గంని నిలదీశారు. దీంతో గ్రామ సభ కొద్దిసేపు రసాభాసగా మారింది.