స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...!

Published: Tuesday July 12, 2022
అంగవైకల్యంతో బాధపడుతున్న బాల్య మిత్రులకు ఆర్థిక చేయూత
మర్పల్లి మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్
వికారాబాద్ బ్యూరో జూలై 11 ప్రజాపాలన : బాల్య స్మృతులను ఆత్మీయ సమ్మేళనంతో మధురానుభూతులు పొందారు. ఒకరి బాగోగుల గురించి మరొకరు అడిగి తెలుసుకొని ఆనందపడ్డారు. మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో 1987 సంవత్సరంలో చదివిన పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో నిర్వహించుకున్నారు. 1987వ సంవత్సరంలో పదవ తరగతిలో 58 మంది విద్యార్థులతో తరగతి గది అంతా కోలాహలంగా ఉండేది. మూడున్నర దశాబ్దాల అనంతరం సంగారెడ్డిలో ఆత్మీయ సమ్మేళనం ద్వారా పునః పరిచయం ఏర్పడింది. నాతో పాటు నా బాల్యమిత్రులైన 58 మందిని ఒకేసారి కలవబోతున్నానని సంతోషపడ్డాను. 58 మంది నా బాల్య మిత్రులలో 42 మంది మాత్రమే హాజరయ్యారు. 9 మంది మాత్రం వారి వారి పనుల కారణంగా ఆత్మీయ సమ్మేళనానికి రాలేకపోయారు. వారిని ఫోన్లో పలకరించే అవకాశం దక్కుతుంది. కానీ నా 7 మంది బాల్యమిత్రులు ఈ లోకాన్ని విడిచి పోయారనే బాధ నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నాడు వారితో గడిపిన తీపి జ్ఞాపకాలు సరదా ముచ్చట్లు అన్ని ఇన్ని కావు. నా బాల్యమిత్రులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలపడం తప్ప దైవాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన 42 మందిలో ఇద్దరు అంగవైకల్యంతో బాధపడుతున్నారనే విషయం నా గుండెను తొలిచేసింది. వారు కొంశేట్ పల్లి గ్రామానికి చెందిన జనార్దన్ కు ప్రమాద వశాత్తు కాలు పూర్తిగా తీసేశారు. పట్లూరు గ్రామానికి చెందిన మాడిశెట్టి కృష్ణకు పక్షవాతం వచ్చింది. వారిద్దరికీ నాకు తోచిన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున నా బాల్య మిత్రులకు ఆర్థిక సహాయం అందజేశాను. నా తోటి మిత్రులు కూడా నాతో ప్రేరణ పొంది ఆర్థిక సహాయం అందచేస్తారని ఆశిస్తున్నాను. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితునిగా నిరూపితం అవ్వాలని ఆకాంక్షించాను. అలాగే పట్లూరు ఉన్నత పాఠశాలలో చదివిన బిల్కల్ గ్రామ నివాసి సి. విష్ణు ఆమెరికాలో హార్ట్ కు సంబంధించిన రిసెర్చ్ సెంటర్ లో ప్రొఫెసర్ గా పనిచేయడం పట్లూరు పాఠశాలకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు తేవడం నాకు గర్వకారణం. వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారందిరు ఒకరికొకరు అభినందించుకున్నారు. 35 సం ల తర్వాత నా బాల్య మిత్రులను కలవడంతో నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మా ఆత్మీయ సమ్మేళనంతో ప్రేరణ పొంది భావితరాల విద్యార్థులు కలుసుకుంటారని ఆశిస్తున్నాను.