ఉపాధ్యాయులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday August 02, 2022

మధిర ఆగస్టు 1 ప్రజాపాలన ప్రతినిధి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సామర్ధ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకువచ్చి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. సోమవారం మధిర పట్టణంలోని హరిజన వాడ ప్రభుత్వ పాఠశాలలో  జరిగిన మండల స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో  ఆయన పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యా వ్యవస్థలో వచ్చిన ఇబ్బందులు అధిగమించేందుకు ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు కనీస సామర్ధ్యాలను పెంచేందుకు ప్రధానంగా 1 నుండి 5వ తరగతి విద్యార్థుల్లో మౌలిక బాషా గణిత సామర్ధ్యాలను పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం పై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేశారని ఆయన గుర్తు చేశారు. గురుకుల పాఠశాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యా విధానం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మెరుగైన సమాజ నిర్మాణానికి విద్యార్థులు కీలకం అని వారిలో నైపుణ్యం పెంచే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి ప్రభాకర్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.