పాపన్నగౌడ్ పోరాట పటిమ చిరస్మరణీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

Published: Monday April 03, 2023
మంచిర్యాల బ్యూరో, ఏప్రిల్ 2, ప్రజాపాలన  :
 
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్థంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో జన్మించారని, అప్పటి తరుష్క, మొగలుల పాలనలో కుల, మతాలకు శిస్తులు వసూలు చేసేవారని, తాటిచెట్లకు పన్నుతో పాటు అనేక విషయాలకు పన్ను విధించేవారని, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న అణచివేత, దాడులను సహించలేక ఎదురించి వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. నాటి రాచరిక పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని పోరాడారని, పాపన్నగౌడ్ చేస్తున్న పోరాటానికి యువత ఆకర్షితులై ఆయనకు తోడుగా పోరాడారని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహనీయులు చూపిన మార్గాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆచరించాలని తెలిపారు. అనంతరం గౌడ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వినోద్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, సంఘ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.