సొంత ఖర్చులతో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తా

Published: Monday May 17, 2021
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
టీఆర్ఎస్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి
మేడిపల్లి, మే16, ప్రజాపాలన ప్రతినిధి : మేడ్చల్ జిల్లా ఉన్నతాధికారులు సహకరిస్తే తన సొంత ఖర్చులతో ఉప్పల్ నియోజకవర్గంలో 100 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని ఉప్పల్ నియోజకవర్గం సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సెంటర్లోని వంద మంది రోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు భోజన ఖర్చులు బీ ఎల్ ఆర్ ట్రస్ట్ నుంచి భరిస్తానని ఆయన అన్నారు. ఆదివారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవనంలో జర్నలిస్టులకు మాస్కులు శానిటైజర్ లు, నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అవసరం ఎంతో ఉందని, సెంటర్ ఏర్పాటుకు జర్నలిస్టులు సైతం తగు సూచనలు చేయాలని కోరారు. బి ఎల్ ఆర్ ట్రస్టు తరపున అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జర్నలిస్టులకు సైతం ఏదో ఒకటి చేయాలనే తపన తనలో ఎప్పటి నుంచో ఉందని, ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాచార సేకరణ కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా ప్రీమియంను గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కావలసిన మొత్తాన్ని తను చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు ఆకుల మహేందర్, అన్య బాలకృష్ణ లు మాట్లాడుతూ కోవిడ్ భయానక పరిస్థితులకు కూడా వెరవకుండా నిత్యం సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరా వేస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించి వారికి తగిన సహాయం  అందించేందుకు ముందుకు వచ్చినా బండారు లక్ష్మారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.  అంతకుముందు ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, ప్రధానకార్యదర్శి నరోత్తం రెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించడంతోపాటు, ఆరోగ్య బీమా పాలసీలను చెల్లించేందుకు ముందుకు వచ్చిన బండారు లక్ష్మారెడ్డి కి ఉప్పల్ ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు సాగర్, ఏవి శ్రీధర్ రావు, ఎం సురేష్ లు, కోశాధికారి యాదగిరి, సహాయ కార్యదర్శి శేఖర్, శివాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం అశోక్ ముఖ్య సలహాదారులు చంద్రమౌళి, టి సురేష్, కంచు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, కోడి కంటి శ్రీనివాస్, సభ్యులు శ్రీహరి, శ్రీశైలం, రాజు తదితరులు పాల్గొన్నారు.