ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహ

Published: Tuesday March 14, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి) : 
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని  కలెక్టర్ ఛాంబర్ లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కౌటాల మండలం తాటి నగర్ గ్రామానికి చెందిన దుర్గం శరత్ చంద్ర తన తాతకు సంబంధించిన ఆస్తిని తన తండ్రి నకిలీ పత్రాలు సృష్టించి ఆధీనంలో ఉంచుకున్నారని,  తన తాతకు చెందిన ఆస్తిని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సిర్పూర్ (టి) మండలం లోనవెల్లి గ్రామానికి చెందిన బోనగిరి శ్వేత తన భర్త పేరిట గ్రామ శివారులో గల భూమిని తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన కుమ్మరి మల్లు బాయి తనకు చెందిన పోడుభూమిని కవులు కొరకు ఇతరులకు ఇవ్వడం జరిగిందని, అధికారులు సర్వే చేయు సమయంలో వారి పేర్లు నమోదు చేశారని, సవరించి తన పేరు నమోదు చేయాలని  దరఖాస్తు అందజేశారు. తుమ్మిడిహెట్టి గ్రామానికి చెందిన కలగూర శైలజ తాను ఎస్.సి. కార్పొరేషన్ రుణం కొరకు దరఖాస్తు చేసుకున్నానని రుణం ఇప్పించాలని అర్జీ సమర్పించారు. మర్తిడి గ్రామానికి చెందిన కుమ్మరి మల్లు బాయి 67 సంవత్సరాల వయసు కలిగి వృద్ధురాలిని అయిన తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.