మహిళలు విద్యుతో పాటు నైపుణ్యానికి సాన పెట్టాలి

Published: Thursday March 09, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన :
సమాజంలో పురుషులు, మహిళలు అందరూ సమానమేనని మహిళలు విద్యతో పాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, సానపట్టి ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో, మన అందరి జీవితాలలో మహిళల ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు.  పట్టణ ప్రాంతాలలోని మహిళలు అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఇంకా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. జ్యోతిబాపూలే పాఠశాల స్థాపించినప్పటి కాలానికి నేటి కాలానికి చాలా మార్పు వచ్చిందని, నేటి మహిళలు విద్యతో పాటు దేశ రక్షణ విభాగంలో , ఇతర అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తెలియజేశారు.  పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, ఎన్నికలలో మహిళలు నిలబడి ఎన్నికవుతున్నారని, కానీ తమ విధులు స్వయంగా నిర్వహించలేక పోతున్నారని, స్వతహాగా రాజకీయాలు నిర్వహించే విధంగా మహిళలు ఎదగాలని అన్నారు. సమాజంలో ఇంకా కొంత మార్పు రావల్సిన అవసరం ఉందన్నారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి  ముందుకు సాగినప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు.  తల్లిగా భార్యగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు ఎంతో గొప్ప వారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా 3 నుండి 4 లక్షల వరకు రుణాలు అందించడం జరుగుతుందని, తీసుకున్న రుణాలతో సంస్థను స్థాపించుకొని యజమానులుగా మారి ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా ఎదగాలన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు 10 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని, ఇట్టి అవకాశం తీసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తమ పాత్రను సమర్థవంతంగా  నిర్వహిస్తున్నారని, గర్భిణీలకు మంచి సూచనలు సలహాలు అందజేస్తూ 90 శాతం స్త్రీలకు ప్రసవాలలో సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు.  గర్భిణీలు బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించి గ్రామాలలో మంచి ఆరోగ్యవంతమైన తరాన్ని అందిస్తున్నారని, ఉద్యోగం చిన్నదైనా తల్లి బిడ్డలకు మేలు చేస్తున్నట్లు కలెక్టర్ వారి సేవలను ప్రశంసించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, భారత దేశంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని,  దేశంలో సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు పాలు పంచుకుంటున్నారని, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.  మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, హింస లాంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన మహిళ ఉద్యోగినులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం శాలువతో సన్మానించారు.  జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకాదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని లలిత కుమారి, భూగర్భ జల శాఖ అధికారి దీపారెడ్డి, సిడిపిఓ రేణుక, ఏ సి డి పి ఓ శ్రీలక్ష్మి లతో పాటు అంగన్వాడీ టీచర్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సభ్యులకు కలెక్టర్ ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కవులు సంగీతపు రాజలింగం, కళాకారులు అర్చన తదితరులు తమ కవితలు పాటలతో అలరించారు. 
 ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డి ఆర్ డి ఓ కృష్ణన్, విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, భూగర్భ జల శాఖ అధికారి దీపా రెడ్డి, మెప్మా పీడీ రవికుమార్, ఏపీ డి నర్సింలు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అలివేణి తదితరులు పాల్గొన్నారు.