న్యాయవాదుల్ని ఆదుకోవాలని బార్ కౌన్సిల్ కు వినతి

Published: Tuesday July 20, 2021
మెట్ పల్లి, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి) కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన న్యాయవాదుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్ సోమవారం తెలంగాణ బార్ కౌన్సిల్ కు వినతి పత్రం పంపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా మూతపడ్డ కోర్టుల వల్ల ఉపాధి కోల్పోయి, న్యాయవాదులందరూ ఆర్థికంగా విలవిలలాడే పరిస్థితి వచ్చినందున, ప్రతి న్యాయవాదికి అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న న్యాయవాదులకు రూ.3 లక్షల రూపాయల రుణాల్ని అందించడం అభినందనీయమని, ఈ రుణాల్ని ఇతర బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న న్యాయవాదులకు సైతం వర్తింపజేయాలని సూచించారు. ఇట్టి రుణాల్ని ఎలాంటి వడ్డీ లేకుండా, కాలయాపన చేయకుండా వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ కు ఆయన విజ్ఞప్తి చేసారు.