పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నాయకులుపాదయాత్రలకు బ్రహ్మరథం పడుతున్న మధిర ప్రజలువి

Published: Tuesday June 14, 2022

మధిర జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరో 15 నెలల్లో జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజల్లోకి ఉండేందుకు పాదయాత్రల బాట పట్టాయి. మధిర నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కాంగ్రెస్ వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు పాదయాత్రలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. దీనికి దీటుగా టిఆర్ఎస్ నేతలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. మధిర శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవల బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధిర మండలంలో పాదయాత్ర పూర్తి చేశారు. వామపక్ష పార్టీలు విద్యుత్ ఛార్జీల పెంపు గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర ధరల పెంపు బస్సు చార్జీలు పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతుంది. నియోజకవర్గంలో దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజల్లో ఉండేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల మధిరలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు భారీగా జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొని టిఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. నియోజకవర్గంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర కనివిని ఎరుగని రీతిలో విజయవంతమైంది. మధిర అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన సభకు ప్రజల భారీస్థాయిలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల మధిరలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలోనే మధిర అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక చోట జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. అదే విధంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం పరామర్శల పేరుతో నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ  టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వివిధ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టడంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.