ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించే దిశగా కృషి జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి మంచిర్యాల బ్

Published: Tuesday November 22, 2022
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన నిట్టూరి మధుకర్, మహేష్, లక్ష్మణ్, లక్ష్మీలు పారుపల్లి గ్రామ శివారులోని భూమి తరతరాలుగా సాగు చేసుకుంటున్నామని, ఇట్టి భూమిని కొందరు ఆక్రమించి ప్లాట్లు చేసే ప్రయత్నంలో ఉన్నారని, దీనిపై విచారణ జరిపి మాకు తగు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన గుమ్ముల రామయ్య తనకు గల భూమికి ఇతరులు అక్రమంగా పట్టా మార్పిడి చేసుకున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. బెల్లంపల్లి మండలం చొప్పరపల్లి గ్రామానికి చెందిన గోమాస భీమయ్య ప్రభుత్వం పోడు భూముల కొరకు దరఖాస్తు చేసుకోమని చెప్పిన సమయంలో అనారోగ్య పరిస్థితుల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయానని, ఇట్టి భూమిని ఇతరులు తమ పేరిట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై విచారణ జరిపి నా పేరిట భూమి మార్పు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామంలో ఓడు భూముల సర్వే సమయంలో అధికారులు 2011 గూగుల్ ఎర్త్ సాటిలైట్ ఇమేజెస్ ను తీసుకువచ్చి మా భూములను నాన్ రికమెండ్ అని రాయడం జరిగిందని, ఇట్టి వివరాలను సవరించి మాకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.