ఉప్పల్ భగాయత్ లో రూ 10 కోట్లతో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

Published: Tuesday December 13, 2022
మేడిపల్లి, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ భగాయత్ లో రెండు ఎకరాల స్థలంలో రూ10 కోట్ల వ్యయంతో  క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి  70 కోట్ల రూపాయల విలువైన రెండు ఎకరాల భూమి కేటాయించడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 
తెలంగాణ ఆత్మగౌరవాన్ని పతాక శీర్షికలో నిలిపారని కొనియాడారు. 10 కోట్ల వ్యయంతో వచ్చే డిసెంబర్ నాటికి  క్రిస్టియన్ భవన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు  అంతా బాసటగా నిలవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా  తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనత అన్నారు. 
క్రైస్తవులంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో గౌరవం అని రాష్ట్ర పశుసంవర్ధక  శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు, క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రధాన కారకుడు మంత్రి కొప్పుల ఈశ్వర్ అని అన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఒత్తిడి చేసి కొంత ఆలస్యమైనప్పటికీ అత్యంత విలువైన ప్రాంతంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి  స్థలం కేటాయింప చేశారని అన్నారు, 32 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. భవన నిర్మాణం కోసం కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వంతో కొట్లాడి సాధించారని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రైస్తవులకు మేలు జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 
సమాజంలో క్రైస్తవులు ఎంతో సేవాభావం కలిగిన వారన్నారు. దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలనిక్రైస్తవులను కోరారు, ఈ సందర్భంగా పలువురు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సన్మానించారు. 
ఈ కార్యక్రమంలో మంత్రులు మహ్మద్ అలీ, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, స్టీఫెన్ సన్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్  చైర్మన్ దామోదర్ గుప్తా, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర, కార్పొరేటర్లు కార్పొరేటర్లు రజిత,  గీత, బొంతు శ్రీదేవి, క్రిస్టియన్ నాయకులు రైడాన్ రోస్, జెరుషలేం మత్తయ్య పలురు క్రైస్తవ మత పెద్దలు, బిషప్ లు, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు, పాల్గొన్నారు.