రైతు బందు పేరుతో కెసిఆర్ నాటకాలు: సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు అకాల వర్షాలకు నష్టపోయ

Published: Tuesday July 26, 2022
బోనకల్, జులై 25 ప్రజా పాలన ప్రతినిధి: గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన గుడిదే నాగేశ్వరరావు, మందడుపు రాకేష్ , ధమాల బాబు తదితర రైతుల పొలాలను సిపిఐ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కేవలం కార్పొరేట్ సంస్థలను బాగుపరచడానికే కానీ రైతులకు ఉపయోగపడేది కాదని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న అవేమీ పేద ప్రజలకు అందడం లేదని, మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోనే రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కేవలం రైతుబంధును కంటి తుడుపు చర్యగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులకు సబ్సిడీలో 24 రకాల పరికరాలు ఇచ్చేవారని, అతివృత్తి అనావృష్టిలకు గురై పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించేవారని, అవేమీ లేకుండా కేవలం రైతుబంధుతో కెసిఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. పంట నష్టపోయిన రైతుల పొలాల వివరాలు, రైతుల వివరాలు వెంటనే తెలుసుకుని, నష్టాన్ని అంచనా వేసి మొక్క దశలో నష్టపోయారు కనుక ఎకరానికి 20000 చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి గుడిదే కృష్ణ, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు వంగాల నరసింహ, కొంగర కృష్ణయ్య, నాయకులు రావుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.