ప్రజా క్షేత్రంలో అపరిష్కృత సమస్యలు పరిష్కారం

Published: Wednesday March 23, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 22 మార్చి ప్రజాపాలన : ప్రజా క్షేత్రంలో అపరిష్కృత సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ముఫ్ల యాస్మిన్ గౌస్ ఉదయం 7 నుండి 10 గంటల వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మురుగు కాలువలలో మిషన్ భగీరథ పైపులు తొలగించాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి వార్డులో ప్రతి ఇంటికి సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలు నల్లాలకు బిగించిన చర్రలు తీయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలన్నారు. నూతనంగా ఏర్పాటైన కాలనీలో కొత్త స్థంబాలను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో మరియు పంట పొలాల్లో ప్రమాదకరంగా క్రిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి, నూతన ట్రాన్స్ఫర్మార్ ఏర్పాటు చేయాలని విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రైతువేదికలలో వ్యవసాయ శాఖ అధికారులు వారానికి ఒకసారి రైతులకు అందుబాటులో ఉండి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వికారాబాద్ మండలంలో మెగా వాటర్ షెడ్ ను ఏర్పాటు చేయించడం జరిగిందని క్లస్టర్ లో ఉన్న 7 గ్రామాలకు ఉపయోగపడుతుందన్నారు. పశువుల డాక్టర్ వారానికి ఒకసారి ఉదయం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని, పశువుల స్టాండ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మూఢనమ్మకాలు లేకుండా 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకాలు ఇప్పించాలన్నారు, గ్రామ ప్రజలందరు టీకాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కమాల్ రెడ్డి, జడ్పిటిసి ప్రమోదిని రెడ్డి, ఎంపిడిఓ సత్తయ్య, ఎంపిటిసి అనుసూజ, ఉప సర్పంచ్ శంషొద్దిన్, కార్యదర్శి సుప్రియ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.