పాఠశాలల్లో స్కావెంజర్ లు ఏర్పాటు చేయాలి

Published: Wednesday September 15, 2021

బోనకల్, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ లు నియమించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని కోరుతూ బోనకల్ మండల యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బోనకల్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో నెలకొని ఉన్న వివిధ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ మంగళవారం నాడు బోనకల్ మండల ఎంపీడీవో  శ్రీదేవికి టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ పక్షాన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ బోనకల్లు మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలల్లో స్కావెంజర్ నియమించక పోవడంవలన పాఠశాల పరిశుభ్రత కు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వారు అన్నారు. కావున సంబంధిత పంచాయతీ సర్పంచ్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పాఠశాలలో స్కావెంజర్ లను నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాల నుండి మాత్రమే డిప్యూటేషన్ లు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులలో విద్యా వాలంటీర్లను నియమించాలని 2019- 20, 20 -21 విద్య సంవత్సరాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండలం ఉపాధ్యక్షులు ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షురాలు పి.సుశీల, బి ప్రీతం, కే అనిల్ కుమార్, పి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.