తమ స్థలంలో జిహెచ్ఎంసీ అధికారుల ఆక్రమ కట్టడాలు... ఒక కుటుంబం ఆందోళన

Published: Tuesday January 25, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : కేసు కోర్ట్ పరిధిలో ఉండగా తమకు చెందిన ప్రైవేట్ ల్యాండ్ లో జిహెచ్ఎంసీ అధికారులు అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మిస్తూ తమ నిర్మాణాన్ని కూల్చేస్తున్నారంటూ ఒక కుటుంబం ఆందోళన కు దిగితే జిహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, పంజాగుట్ట పోలీసులు వారిని అడ్డుకున్న ఘటన సోమాజిగూడలో జరిగింది. వివరాలలోకి వెళితే సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్ లోని (6-3-1238) నెంబర్ లో గల 650 గజాలలో ఉన్న తమ ఇంటిని జిహెచ్ఎంసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకొని పార్కులు నిర్మించేందుకు చూస్తున్నారని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. 2000 సంవత్సరంలో తాము సదరు స్థలాన్ని కొనుగోలు చేశామని అప్పటి నుంచి ఇంటి పన్ను కరెంటు బిల్లు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. సదరు స్థలంపై వివాదం తల ఎత్తడం తో తాము హైకోర్టును ఆశ్రయించామని విచారణ జరిపిన న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగించాలని (స్టే) 2012 సంవత్సరంలో తీర్పు నిచ్చిందని తెలిపారు. గత 15 రోజులుగా పనులు జరుగుతుండగా తాము గుర్తించి కోర్టు ఆదేశాలను ఉన్నతాధికారులకు చూపించినా పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని వాపోయారు. దీంతో పనులు జరుగుతున్న స్థలం వద్దకు రాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది తమను అకారణంగా గెంటి వేస్తున్నారని వాపోయారు. ఈనేపథ్యంలో పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్లగా వారు సైతం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.