బాల్ రెడ్డి గూడ దివ్యాంగునిపై దాడి అమానుషం

Published: Friday October 29, 2021
బివిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : దివ్యాంగుడు మాదిగ శంకరయ్య పై దాడి అమానుషమని బివిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు, ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షుడు జె.దశరథ్ లు సంయుక్తంగా ఖండించారు. గురువారం బాల్ రెడ్డి గూడ గ్రామానికి చెందిన మాదిగ శంకరయ్య పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి ఎం.నారాయణకు జిల్లా ఎస్పి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోమిన్పేట్ మండల పరిధిలోగల బాల్ రెడ్డి గూడ గ్రామానికి చెందిన దివ్యాంగుడు మాదిగ శంకరయ్య పై అదే గ్రామానికి చెందిన బాలన్నోల్ల బక్కారెడ్డి, మాల కిష్టయ్యలు కలిసి దాడి చేయడం అమానవీయ చర్య అని విమర్శించారు. అకారణంగా దాడి చేసిన వారిపై దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని వివరించారు. దాడి గురించి బాధితుడు మాదిగ శంకరయ్య నవాబ్ పేట ఎస్ఐకి ఫిర్యాదు చేయగా దివ్యాంగుల చట్టాన్ని నమోదు చేయకుండా ఇతర సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు. నవాబ్ పేట ఎస్సై పై తగు చర్యలు తీసుకొని దివ్యాంగుడు మాదిగ శంకరయ్య కు న్యాయం చేయాలని కోరారు. దివ్యాంగుల పై ఇలాగే అమానవీయ దాడులు జరుగితే లక్ష మందితో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో వివిధ గ్రామాల దివ్యాంగులు హెచ్ పిఎస్ జంగం పర్మయ్య, దశరథ్, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.